దానియేలు 6:16-28

దానియేలు 6:16-28 TELUBSI

అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజు–నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసికొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి; మరియు దానియేలునుగూర్చి రాజుయొక్క తీర్మానము మారునేమో యని, రాజు ముద్రను అతని యధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి. అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగ నియ్యలేదు; అతనికి నిద్రపట్టకపోయెను. తెల్లవారు జామున రాజు వేగిరమే లేచి సింహముల గుహదగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహదగ్గరకు రాగానే, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి–జీవముగల దేవుని సేవ కుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని యతనిని అడిగెను. అందుకు దానియేలు–రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవునిదృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను. రాజు ఇందునుగూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలోనుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగ లేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలుమీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొనివచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి, సింహములు వారి యెముకలను సహితము పగులగొరికి పొడిచేసెను. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకలజనులకును రాష్టములకును ఆయా భాషలు మాటలాడువారికిని ఈలాగు వ్రాయించెను–మీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించిన దేమనగా – నా రాజ్యములోని సకల ప్రభుత్వములయందుండు నివాసులు దానియేలుయొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనముకానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించు వాడునైయుండి, పరమందును భూమిమీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటనుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వకాలమందును వర్ధిల్లెను.