దానియేలు 4:1-18

దానియేలు 4:1-18 TELUBSI

రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. నెబుకద్నెజరను నేను నా యింట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనైయుండి యొక కల కంటిని; అది నాకు భయము కలుగజేసెను. నేను నా పడకమీద పరుండియుండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను. కావున ఆ స్వప్నభావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులనందరిని నా యెదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞ నేనిచ్చితిని. శకునగాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతి ష్కులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేక పోయిరి. కడపట బెల్తెషాజరను నా దేవత పేరునుబట్టి బిరుదుపొందిన దానియేలను వాడు నా యెదుటికి వచ్చెను; పరిశుద్ధ దేవతల ఆత్మ అతనియందుండెను, కావున నేనతనికి నా కలను చెప్పితిని. ఎట్లనగా–శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరూ, పరిశుద్ధదేవతల ఆత్మ నీయందున్నదనియు, ఏ మర్మము నిన్ను కలతపెట్టదనియు నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియ జెప్పుము. నేను నా పడకమీద పరుండియుండగా నాకు ఈ దర్శనములు కలిగెను; నేను చూడగా భూమిమధ్యను మిగుల ఎత్తుగల యొక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకా శమునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారముండెను; దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెను; సకల మనుష్యులకు చాలునంత ఆహారము దానియందుండెను. మరియు నేను నా పడక మీద పండుకొనియుండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా, జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశమునుండి దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను –ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి; పశువులను దాని నీడనుండి తోలివేయుడి; పక్షులను దాని కొమ్మలనుండి ఎగురగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి, పొలములోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడువుడి. ఏడు కాలములు గడచువరకు వానికున్న మానవమనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును. బెల్తెషాజరూ, నెబుకద్నెజరను నాకు కలిగిన దర్శనము ఇదే; నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్ప నేరడు. నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవేదానిని చెప్ప సమర్థుడ వంటిని.