దానియేలు 3:19-28

దానియేలు 3:19-28 TELUBSI

అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములోనుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి–షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండమునడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడినవారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవరముగ లేచి–మేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితిమిగదా యని తన మంత్రుల నడిగెను. వారు–రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తర మిచ్చిరి. అందుకు రాజు–నేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి–షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికివచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చిరి. అధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు–షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి.