దానియేలు 2:10-16

దానియేలు 2:10-16 TELUBSI

అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి–భూమిమీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునగానియొద్దను గారడీవిద్య గలవానియొద్దను కల్దీయునియొద్దను ఇట్టి సంగతి విచారింప లేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలుకాక మరెవరును ఈ సంగతి తెలియజెప్ప జాలరు; దేవతల నివాసములు శరీరులమధ్య ఉండవుగదా. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గల వాడై బబులోనులోని జ్ఞానులనందరిని సంహరింపవలెనని యాజ్ఞ ఇచ్చెను. ఇట్టి శాసనము బయలుదేరుటవలన జ్ఞానులు చంపబడవలసియుండగా, వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహసంరక్షకుల యధిపతియగు అర్యోకుదగ్గరకు పోయి, జ్ఞానయుక్తముగా మనవిచేసెను –రాజు నొద్దనుండి ఈ యాజ్ఞ యింత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజుయొక్క అధిపతియైన అర్యోకు నడుగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియ జెప్పుటకై తనకు సమయము దయచేయుమని రాజును బతిమాలెను.