కొలొస్సయిలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమనిచెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమనుగూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించు చున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసునివలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు; అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము.
Read కొలొస్సయులకు 1
వినండి కొలొస్సయులకు 1
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కొలొస్సయులకు 1:1-12
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు