అపొస్తలుల కార్యములు 7:20-43

అపొస్తలుల కార్యములు 7:20-43 TELUBSI

ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచ బడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసికొని తన కుమారునిగా పెంచు కొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్య సించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను. అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి, వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలం చెను గాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి–అయ్యలారా, మీరు సహోదరులు; మీరెందుకు ఒకనికొకడు అన్యా యము చేసికొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ జూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు–మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలచియున్నావా అని అతనిని త్రోసివేసెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశియైయుండి, అక్కడ ఇద్దరు కుమారులను కనెను. నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా –నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు–నీ చెప్పులు విడువుము; నీవు నిలిచియున్నచోటు పరిశుద్ధభూమి. ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదు నని అతనితో చెప్పెను. –అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడని వారు నిరాకరించిన యీ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. –నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే. సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై – మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తు దేశములోనుండి మనలను తోడుకొని వచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచి పెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది. –ఇశ్రాయేలు ఇంటివారలారా మీరు అరణ్యములో నలువది యేండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా? మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు గుడారమును రొంఫాయను దేవతయొక్క నక్షత్రమును మోసికొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను.

అపొస్తలుల కార్యములు 7:20-43 కోసం వీడియో