అపొస్తలుల కార్యములు 5:5-42

అపొస్తలుల కార్యములు 5:5-42 TELUBSI

అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారికందరికిని మిగుల భయము కలిగెను; అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి. ఇంచుమించు మూడు గంటల సేపటికి వానిభార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు–మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె–అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు–ప్రభువుయొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదములయొద్దపడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను. ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహ త్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కు వగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి. ప్రధానయాజకుడును అతనితోకూడ ఉన్నవారందరును, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసికొని వచ్చి–మీరు వెళ్లి దేవాలయములో నిలువబడి ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధానయాజకుడును అతనితోకూడ నున్నవారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించి –వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి. బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగివచ్చి –చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతట దేవాలయపు అధిపతియు ప్రధానయాజకులును ఆ మాటలు విని–ఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి. అప్పుడు ఒకడు వచ్చి–ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రౌతులతోకూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను. వారిని తీసికొనివచ్చి సభలో నిలువబెట్టగా ప్రధానయాజకుడు వారిని చూచి–మీరు ఈ నామమునుబట్టి బోధింప కూడ దని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. అందుకు పేతురును అపొస్తలులును–మనుష్యు లకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించియున్నాడు. మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొనివీరిని చంప నుద్దేశించగా సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి–ఈ మనుష్యులను కొంత సేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను –ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్తసుమండి. ఈ దినములకుమునుపు థూదా లేచి తానొక గొప్ప వాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసి కొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతోకూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడు కూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరి పోయిరి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా–ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును. దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ. వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించి–యేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందునవారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.

అపొస్తలుల కార్యములు 5:5-42 కోసం వీడియో