అపొస్తలుల కార్యములు 28:17-31

అపొస్తలుల కార్యములు 28:17-31 TELUBSI

మూడుదినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైనవారిని తనయొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడతడు–సహోదరులారా, నేను మన ప్రజల కైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను, యెరూషలేములోనుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందునన వలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనముమీద నేరమేమియు మోపవలెనని నా అభిప్రాయము కాదు; ఈ హేతువుచేతనే మిమ్మును చూచి మాటలాడవలెనని పిలిపించితిని; ఇశ్రాయేలుయొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడియున్నానని వారితో చెప్పెను. అందుకు వారు–యూదయనుండి నిన్నుగూర్చి పత్రికలు మాకు రాలేదు; ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్క డైనను నిన్నుగూర్చి చెడుసంగతి ఏదియు మాకు తెలియ పరచను లేదు, మరియు ఎవరును చెప్పుకొనను లేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీవలన విన గోరుచున్నాము; ఈ మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియుననిరి. అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములోనుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్లిపోయిరి. అదేదనగా. –మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు; చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని యీ ప్రజలయొద్దకు వెళ్లి చెప్పుము. ఈ ప్రజలు కన్నులార చూచి చెవు లార విని మనసార గ్రహించి నావైపు తిరిగి నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృద యము క్రొవ్వియున్నది. వారు చెవులతో మంద ముగా విని కన్నులు మూసికొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీపితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురుగాక, వారు దాని విందురు. పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె యింట కాపురముండి, తనయొద్దకు వచ్చువారినందరిని సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసు క్రీస్తునుగూర్చిన సంగతులు బోధించుచు ఉండెను.

అపొస్తలుల కార్యములు 28:17-31 కోసం వీడియో