ఆ యల్లరి అణగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించినమీదట వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్లుటకు బయలు దేరెను. ఆ ప్రదేశములయందు సంచరించి, పెక్కుమాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడయెక్కి సిరియకు వెళ్ల వలెనని యుండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియమీదుగా తిరిగి రావలెనని నిశ్చయించుకొనెను. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడునైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైనన తుకికు, త్రోఫిమును అతనితోకూడ వచ్చిరి. వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి. పులియనిరొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారియొద్ద ఏడు దినములు గడిపితిమి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను నొక యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై యెత్తబడెను. అంతట పౌలు క్రిందికి వెళ్లి అతనిమీదపడి కౌగిలించుకొని–మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను. అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, తెల్లవారువరకు విస్తారముగా సంభాషించి బయలు దేరెను. వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చి నప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్లితిమి. తాను కాలి నడకను వెళ్లవలెనని అతడా ప్రకారముగా మాకు నియమించియుండెను. అస్సులో అతడు మాతో కలిసికొని నప్పుడు మేమతనిని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి. అచ్చటనుండి వెళ్లి మరునాడు కీయొసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమొసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫె సును దాటిపోవలెనని నిశ్చయించుకొని యుండెను.
చదువండి అపొస్తలుల కార్యములు 20
వినండి అపొస్తలుల కార్యములు 20
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల కార్యములు 20:1-16
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు