అపొస్తలుల కార్యములు 2:1-13

అపొస్తలుల కార్యములు 2:1-13 TELUBSI

పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతిమనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి–ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి? పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అను దేశములయందలివారు, కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే–వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి.

అపొస్తలుల కార్యములు 2:1-13 కోసం వీడియో