అపొస్తలుల కార్యములు 19:1-10

అపొస్తలుల కార్యములు 19:1-10 TELUBSI

అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి–మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా వారు–పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడతడు–ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు–యోహాను బాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు–యోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరు ఇంచుమించు పండ్రెండుగురు పురుషులు. తరువాత అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమునుగూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్నవారందరును ప్రభువు వాక్యము వినిరి.

అపొస్తలుల కార్యములు 19:1-10 కోసం వీడియో