అపొస్తలుల కార్యములు 19
19
1అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి–మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా 2వారు–పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. 3అప్పుడతడు–ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు–యోహాను బాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి. 4అందుకు పౌలు–యోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను. 5వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. 6తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. 7వారందరు ఇంచుమించు పండ్రెండుగురు పురుషులు.
8తరువాత అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమునుగూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను. 9అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. 10రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్నవారందరును ప్రభువు వాక్యము వినిరి. 11మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను; 12అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డైలెనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను. 13అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు–పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన#19:13 అనగా–మంత్రించుట. చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పెట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. 14యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి. 15అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా 16ఆ దయ్యముపెట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి. 17ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘన పరచబడెను. 18విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసి యొప్పుకొనిరి. 19మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను. 20ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.
21ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమునవచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మనస్సులో ఉద్దేశించి–నేనక్కడికి వెళ్లిన తరువాత రోమా కూడ చూడవలెనని అనుకొనెను. 22అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను.
23ఆ కాలమందు క్రీస్తు మార్గమునుగూర్చి చాల అల్లరి కలిగెను. 24ఏలాగనగా – దేమేత్రియను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించుటవలన ఆ పనివారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. 25అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుకూర్చి–అయ్యలారా, యీ పనివలన మనకు జీవనము బహు బాగుగా జరుగు చున్నదని మీకు తెలియును. 26అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు. 27మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయేగాక, మహాదేవియైన అర్తెమి దేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియయందంతటను భూలోకమందును పూజింపబడుచున్న యీమెయొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచు చున్నదని వారితో చెప్పెను. 28వారు విని రౌద్రముతో నిండిన వారై–ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి; 29పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసి దోనియవారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. 30పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలచెను, గాని శిష్యులు వెళ్లనియ్యలేదు. 31మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహి తులైయుండి అతనియొద్దకు వర్తమానము పంపి–నీవు నాటక శాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి. 32ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరీలాగున, కొందరాలాగున కేకలువేసిరి; తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలమందికి తెలియలేదు. 33అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములోనుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను. 34అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏకశబ్దముతో రెండు గంటలసేపు–ఎఫెసీయుల అర్తెమి దేవి మహాదేవి అని కేకలువేసిరి. 35అంతట కరణము సమూహమును సముదాయించి–ఎఫెసీయులారా, ఎఫె సీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియని వాడెవడు? 36ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము. 37మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు. 38దేమేత్రికిని అతనితోకూడనున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒక రితో ఒకరు వ్యాజ్యె మాడవచ్చును. 39అయితే మీరు ఇతర సంగతులనుగూర్చి యేమైనను విచారణ చేయవలెనని యుంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. 40మనము ఈ గలిబిలినిగూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. 41అతడీలాగు చెప్పి సభను ముగించెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
అపొస్తలుల కార్యములు 19: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.