అపొస్తలుల కార్యములు 18:18-28

అపొస్తలుల కార్యములు 18:18-28 TELUBSI

పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి, తాను మాత్రము సమాజమందిరములో ప్రవేశించి, యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా అతడు ఒప్పక–దేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగి వత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను. తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపువారిని కుశలమడిగి, అంతియొకయకు వచ్చెను. అక్కడ కొంతకాలముండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగియయందును సంచరించుచు శిష్యులనందరిని స్థిరపరచెను. అలెక్సంద్రియవాడైన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై యుండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మముమాత్రమే తెలిసికొనిన వాడైనను, యేసునుగూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించుచు, సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను. ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహ పరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించినవారికి చాల సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను.

అపొస్తలుల కార్యములు 18:18-28 కోసం వీడియో