అపొస్తలుల కార్యములు 13:1-12

అపొస్తలుల కార్యములు 13:1-12 TELUBSI

అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతోకూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ–నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మచేత పంపబడినవారై సెలూ కయకు వచ్చి అక్కడనుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను. వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చి నప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకముగలవాడైన సెర్గి పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను; ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరిచూచి–సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువుయొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను. అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వ సించెను.

అపొస్తలుల కార్యములు 13:1-12 కోసం వీడియో