అపొస్తలుల కార్యములు 12:5-16

అపొస్తలుల కార్యములు 12:5-16 TELUBSI

పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికులమధ్య నిద్రించు చుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి–త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతనిచేతులనుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో–నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత –నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురుకు తెలివివచ్చి–ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించియున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనేకులుకూడి ప్రార్థనచేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపుతట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి, సంతోషముచేత తలుపుతీయక లోపలికి పరుగెత్తి కొనిపోయి–పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు–నీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు–అతని దూత అనిరి. పేతురు ఇంకనుతట్టుచున్నందునవారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.

అపొస్తలుల కార్యములు 12:5-16 కోసం వీడియో