అపొస్తలుల కార్యములు 11:1-18

అపొస్తలుల కార్యములు 11:1-18 TELUBSI

అన్యజనులును దేవుని వాక్యమంగీకరించిరని అపొస్తలులును యూదయ యందంతటనున్న సహోదరులును వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు –నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనముచేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెను –నేను యొప్పే పట్టణములో ప్రార్థనచేయుచుండగా పరవశుడనైతిని, అప్పుడొక దర్శనము నాకు కలిగెను; అది ఏదనగా నాలుగు చెంగులుపెట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొక విధమైన పాత్ర ఆకాశమునుండి దిగి నాయొద్దకు వచ్చెను. దానివైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమియందుండు చతుష్పాద జంతువులును అడవి మృగములును ప్రాకెడు పురుగులును ఆకాశపక్షులును నాకు కనబడెను. అప్పుడు –పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని యొక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను–వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడును పడలేదని చెప్పగా రెండవమారు ఆ శబ్దము ఆకాశము నుండి–దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను. ఈలాగు ముమ్మారు జరిగెను; తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసికొని పోబడెను. వెంటనే కైసరయనుండి నాయొద్దకు పంప బడిన ముగ్గురు మనుష్యులు మేమున్న యింటియొద్ద నిలిచి యుండిరి. అప్పుడు ఆత్మ –నీవు భేదమేమియు చేయక వారితోకూడ వెళ్లుమని నాకు సెలవిచ్చెను. ఈ ఆరుగురు సహోదరులు నాతోకూడ వచ్చిరి; మేము కొర్నేలి యింట ప్రవేశించితిమి. అప్పుడతడు–నీవు యొప్పేకు మనుష్యు లను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము; నీవును నీ యింటివారందరును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన యింట నిలిచి తనతో చెప్పిన యొక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. నేను మాటలాడ నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను. అప్పుడు–యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తి స్మము పొందుదురని ప్రభువు చెప్పినమాట నేను జ్ఞాపకము చేసికొంటిని. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడ సమానవరము అనుగ్రహించి యుండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పెను. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక–అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసియున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.

అపొస్తలుల కార్యములు 11:1-18 కోసం వీడియో