అపొస్తలుల కార్యములు 1:5-14

అపొస్తలుల కార్యములు 1:5-14 TELUBSI

యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. కాబట్టి వారు కూడివచ్చినప్పుడు–ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన –కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి –గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొన బడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.

అపొస్తలుల కార్యములు 1:5-14 కోసం వీడియో

Free Reading Plans and Devotionals related to అపొస్తలుల కార్యములు 1:5-14