2 తిమోతికి 2:1-15

2 తిమోతికి 2:1-15 TELUBSI

నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము, క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కు కొనడు. మరియు జెట్టియైనవాడు పోరాడునప్పుడు, నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసినవాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము; అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును. నా సువార్త ప్రకారము, దావీదు సంతానములో పుట్టి మృతులలోనుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకముచేసికొనుము. నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్తవిషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు. అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతోకూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది, ఏదనగా–మన మాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము. సహించిన వారమైతే ఆయనతోకూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును. మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దని, ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.

2 తిమోతికి 2:1-15 కోసం వీడియో