దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను–నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నే నెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతినిబట్టి, బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవుదానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగియున్నావు. నీ వాక్కునుబట్టి నీ యిష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు, నీవంటి దేవుడొకడును లేడు; మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులనుబట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తుదేశములోనుండియు, ఆ జనుల వశములోనుండియు, వారి దేవతల వశములోనుండియు నీవు విమోచించిన ఇశ్రాయేలీయులనునట్టి నీ జనులవంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది. మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవైయుండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై యుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. దేవా యెహోవా, నీ దాసుడనగునన్నుగూర్చియు నా కుటుంబమునుగూర్చియు నీవు సెలవిచ్చినమాట యెన్నటికి నిలుచునట్లు దృఢపరచి సైన్యములకధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై యున్నాడను మాటచేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చినమాట నెరవేర్చుము. ఇశ్రాయేలీయుల దేవా సైన్యములకధిపతియగు యెహోవా–నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే; నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము; యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చియున్నావు; నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక.
Read 2 సమూయేలు 7
వినండి 2 సమూయేలు 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 2 సమూయేలు 7:18-29
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు