సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో మూడువందలమందిని హతముచేసి వారిమీద తన యీటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గు రిలో పేరుపొందినవాడు. ఇతడు ఆ ముప్పదిమందిలో ఘనుడై వారికి అధిపతి యాయెనుగాని మొదటి ముగ్గు రితో సమానుడు కాకపోయెను. మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమ శాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను నొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగి యున్న యొక సింహమును చంపి వేసెను. ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డుకఱ్ఱ తీసికొని వానిమీదికి పోయి వాని చేతిలోని యీటె ఊడలాగి దానితోనే వాని చంపెను. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోను అతడు పేరుపొంది ఆ ముప్పదిమందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను.
ఆ ముప్పదిమంది యెవరనగా, యోవాబు సహోదరుడైన అశాహేలు, బేత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను, హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా, పల్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా, అనాతోతీయుడైన అబీ యెజరు, హుషాతీయుడైన మెబున్నయి, అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై నెటోపా తీయుడైన బయానాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి, పిరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి, అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేనుయొక్క కుమారులలో యోనాతాను, హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారునకు పుట్టిన అహీయాము, మాయాకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలీయాము, కర్మెలీయుడైన హెస్రై, అర్బీయుడైన పయరై, సోబావాడగు నాతానుయొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ, అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, యితడు సెరూయా కుమారుడగు యోవాబుయొక్క ఆయుధములను మోయువాడై యుండెను. ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా. వారందరు ముప్పదియేడుగురు.