2 సమూయేలు 22:2-20

2 సమూయేలు 22:2-20 TELUBSI

యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణశృంగము నా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు బలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టితిని నా శత్రువుల చేతిలోనుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువుయొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరదపొర్లువలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదరించగను పాతాళపాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను పరమండలపు పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రములలోనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను నిప్పు కణములను రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి యుండెను. కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను. గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను. గుడారమువలె అంధకారము తనచుట్టు వ్యాపింప జేసెను. నీటిమబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను. ఆయన సన్నిధికాంతిలోనుండి నిప్పుకణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను. తనబాణములను ప్రయోగించి శత్రువులను చెదర గొట్టెను మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను. ఉన్నతస్థలములనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాసులలోనుండి తీసెను. బలవంతులగు పగవారు, నన్ను ద్వేషించువారు, నాకంటె బలిష్ఠులై యుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందువారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను.