2 సమూయేలు 12:14-23

2 సమూయేలు 12:14-23 TELUBSI

అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడియుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నిక యైనవారు లేచి అతనిని నేలనుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయక యుండెను. ఏడవదినమున బిడ్డ చావగా–బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటలాడినప్పుడు అతడు మా మాటలు వినక యుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయెనని మనము అతనితో చెప్పినయెడల తనకుతాను హాని చేసికొనునేమో యనుకొని, దావీదు సేవకులు బిడ్డ చనిపోయెనను సంగతి అతనితో చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చని పోయెనను సంగతి గ్రహించి–బిడ్డ చనిపోయెనా అని తన సేవకుల నడుగగా వారు–చనిపోయెననిరి. అప్పుడు దావీదు నేలనుండి లేచి స్నానముచేసి తైలము పూసికొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన యింటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి; అప్పుడు అతడు భోజనము చేసెను. అతని సేవకులు–బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దానికొరకు ఏడ్చుచుంటివిగాని అది మరణమైనప్పుడు లేచి భోజనముచేసితివి. నీవీలాగున చేయుట ఏమని దావీదు నడుగగా అతడు–బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రదికించునేమో యనుకొని నేను ఉపవాసముండి యేడ్చు చుంటిని. ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వానియొద్దకు పోవుదునుగాని వాడు నాయొద్దకు మరల రాడని వారితో చెప్పెను.