2 రాజులు 6:25-33

2 రాజులు 6:25-33 TELUBSI

అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి యుండగా గాడిదయొక్క తల ఎనుబది రూపాయలకును, అరపావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మ బడెను; వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి. అంతట ఇశ్రాయేలురాజు పట్టణపు ప్రాకారముమీద సంచారముచేయగా ఒక స్త్రీ రాజును చూచి–రాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని –యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్లములోనుండి యైనను ద్రాక్షగానుగలోనుండియైనను దేనినైనను ఇచ్చి సహాయముచేయ వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమనియడుగగా అది–ఈ స్త్రీ నన్ను చూచి– నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంటచేసికొని తింటిమి. అయితే మరునాటియందు నేను దాని చూచి–నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితినిగాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని యింక ప్రాకారముమీద నడిచి పోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను. తరువాత రాజు–షాపాతు కుమారుడైన ఎలీషాయొక్క తల యీ దినమున అతనిపైన నిలిచియున్నయెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయునుగాక అనెను. అయితే ఎలీషా తన యింట కూర్చునియుండగా పెద్దలును అతనితోకూడ కూర్చుండి యున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడినవాడు ఎలీషాదగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూచి–ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టియుండి, ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండ తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసి వేయుడి; వాని యజమానుని కాళ్లచప్పుడు వానివెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతనియొద్దకు వచ్చెను. అంతట రాజు–ఈ కీడు యెహోవా వలననైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి యుండవలెననెను.