2 రాజులు 4:1-34

2 రాజులు 4:1-34 TELUBSI

అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య–నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవాయందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొనిపోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొఱ్ఱపెట్టగా ఎలీషా–నా వలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియ జెప్పుమనెను. అందుకామె–నీ దాసురాలనైన నా యింటిలో నూనెకుండ యొకటి యున్నది; అది తప్ప మరేమియు లేదనెను. అతడు–నీవు బయటికి పోయి, నీ యిరుగు పొరుగు వారందరియొద్ద దొరుకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరవు పుచ్చుకొనుము; అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపలనుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి యొకతట్టున ఉంచుమని ఆమెతో సెలవియ్యగా ఆమె అతని యొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు–మరేమియు లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచి పోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు–నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ–భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనముచేయుచువచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి–మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పు డెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి–ఈ షూనేమీయురాలిని పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు అతడు–నీవు ఇంత శ్రద్ధా భక్తులు మాయందు కనుపరచితివి నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్నుగూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆప్రకారము ఆమెతో అనెను. అందుకామె–నేను నా స్వజనులలో కాపురమున్నాననెను. ఎలీషా–ఆమె నేనేమి చేయకోరుచున్నదని వానినడుగగా గేహజీ–ఆమెకు కుమారుడు లేడు; మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు–ఆమెను పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా –మరుసటియేట ఈ రుతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని–దైవజనుడవైన నా యేలినవాడా, ఆలాగు పలుకవద్దు; నీ దాసురాల నైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతియై మరుసటియేట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ యెదిగిన తరువాత ఒకనాడు కోత కోయువారియొద్దనున్న తన తండ్రి దగ్గరకుపోయి అక్కడ ఉండగా వాడు–నా తలపోయెనే నా తల పోయెనే, అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకొని తల్లియొద్దకు తీసికొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తికొని వాని తల్లియొద్దకు తీసికొనిపోయెను. పిల్లవాడు మధ్యాహ్నమువరకు తల్లి తొడమీద పండుకొని యుండి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచముమీద పెట్టి తలుపువేసి బయటికి వచ్చి –ఒక పనివానిని ఒక గాడిదను నాయొద్దకు పంపుము; నేను దైవజనునియొద్దకు పోయి వచ్చెదనని తన పెనిమిటితో ఆమె యనగా అతడు–నేడు అమావాస్య కాదే; విశ్రాంతిదినముకాదే; అతనియొద్దకు ఎందుకు పోవుదువని యడుగగా ఆమె–నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంతకట్టించి తాను ఎక్కి తన పని వానితో–శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనేగాని నిమ్మళముగా తోలవద్దనెను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనునియొద్దకు వచ్చెను. దైవజనుడు దూరమునుండి ఆమెను చూచి– అదిగో ఆ షూనేమీయురాలు; నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి–నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను. అందుకామె– సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనునియొద్దకు వచ్చి అతని కాళ్లు పట్టుకొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు – ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను; ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె–కుమారుడు కావలెనని నేను నా యేలిన వాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా? అని అతనితో మనవిచేయగా అతడు–నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము; ఎవరైనను నీకు ఎదురుపడినయెడల వారికి నమస్కరింపవద్దు; ఎవరైనను నీకు నమస్కరించినయెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు; అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖముమీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని–యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతోకూడ పోయెను. గేహజీ వారికంటె ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెనుగాని యే శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి – బాలుడు మేలుకొనలేదని చెప్పెను. ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడి యుండుట చూచి తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసి మంచముమీద ఎక్కి బిడ్డమీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటిమీదను తన కండ్లు వాని కండ్లమీదను తన చేతులు వాని చేతులమీదను ఉంచి, బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను.