2 రాజులు 2:7-15

2 రాజులు 2:7-15 TELUBSI

ప్రవక్తల శిష్యులలో ఏబదిమంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యొర్దానునదిదగ్గర నిలిచిరి. అంతట ఏలీయా తన దుప్పటి తీసికొని మడత పెట్టి నీటిమీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరు పొడినేలమీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి–నేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషా–నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను. అందుకతడు–నీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీయొద్దనుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినయెడల ఆప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవునని చెప్పెను. వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను ఎలీషా అది చూచి–నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని కేకలువేసెను; అంతలో ఏలీయా అతనికి మరల కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను. మరియు ఏలీయా దుప్పటి క్రింద పడగా అతడు దాని తీసికొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటిమీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టి–ఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను. యెరికోదగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి–ఏలీయా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి