2 కొరింథీయులకు 11:2-15

2 కొరింథీయులకు 11:2-15 TELUBSI

దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి యున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రదానము చేసితిని గాని, సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానినిగూర్చి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె లేశమాత్రమును తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను. మాటలయందు నేను నేర్పులేనివాడనైనను జ్ఞానమందు నేర్పులేని వాడను కాను. ప్రతి సంగతిలోను అందరిమధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనుపరచియున్నాము. మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితినా? మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము పుచ్చుకొని, వారి ధనము దొంగిలినవాడనైతిని. మరియు నేను మీయొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా నేనెవనిమీదను భారము మోపలేదు; మాసిదోనియనుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్తపడితిని, ఇక ముందుకును జాగ్రత్తపడుదును క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు నేనీలాగు అతిశయ పడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరముకాదు. ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే తెలియును. అతిశయకారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరకకుండ కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే యిక ముందుకును చేతును. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పని వారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.