2 కొరింథీయులకు 11:12-27

2 కొరింథీయులకు 11:12-27 TELUBSI

అతిశయకారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరకకుండ కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే యిక ముందుకును చేతును. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పని వారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. నేను అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పు చున్నాను. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చు కొనుడి. నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను. అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును. మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను, ఒకడు మిమ్ము మ్రింగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకొనినను, ఒకడు తన్ను గొప్పచేసికొనినను, ఒకడు ముఖముమీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు. మేము బలహీనులమై యున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగి యున్నాడో, ఆ విషయమందు నేను కూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా. వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యా యములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని; ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలిదప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్ప వలసినవి అనేకములున్నవి.