2 దినవృత్తాంతములు 30:6-9

2 దినవృత్తాంతములు 30:6-9 TELUBSI

కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతులయొద్దను తాకీదులు తీసికొని, యూదా ఇశ్రాయేలుదేశములందంతట సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరి–ఇశ్రాయేలువారలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవావైపు తిరుగుడి; మీరు తిరిగినయెడల మీలో అష్షూరురాజుల చేతిలోనుండి తప్పించుకొని శేషించినవారివైపు ఆయన తిరుగును. తమపితరుల దేవుడైన యెహోవాయెడల ద్రోహముగా ప్రవర్తించిన మీపితరులవలెను మీ సహోదరులవలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశమునకు అప్పగించెను. మీపితరులవలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతముగా పరిశుద్ధపర చిన ఆయన పరిశుద్ధమందిరములో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీదినుండి తొలగి పోవునట్లు ఆయనను సేవించుడి. మీరు యెహోవావైపు తిరిగినయెడల మీ సహోదరులయెడలను మీ పిల్లల యెడలను చెరతీసికొనిపోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణాకటాక్షములుగలవాడు గనుక మీరు ఆయనవైపు తిరిగినయెడల ఆయన మీయందు ప్రసన్ను డగును.