2 దినవృత్తాంతములు 30
30
1మరియు హిజ్కియా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలువారికందరికిని యూదావారికందరికిని వర్తమానములను, ఎఫ్రాయిమీయులకును మనష్షేవారికిని పత్రికలను పంపెను. 2సేవకు చాలినంతమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుటచేతను, జనులు యెరూషలేములో కూడుకొనకుండుటచేతను, మొదటినెలయందు పస్కాపండుగ జరుగకపోగా 3రాజును అతని అధిపతులును యెరూషలేములోనున్న సమాజపువారందరును దానిని రెండవనెలలో ఆచరింపవలెనని యోచనచేసిరి. 4ఈ సంగతి రాజుకును సమాజపువారికందరికిని అనుకూల మాయెను. 5కావున బహుకాలమునుండి వారు వ్రాయ బడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కాపండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దానువరకు ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయముచేసిరి. 6కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతులయొద్దను తాకీదులు తీసికొని, యూదా ఇశ్రాయేలుదేశములందంతట సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరి–ఇశ్రాయేలువారలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవావైపు తిరుగుడి; మీరు తిరిగినయెడల మీలో అష్షూరురాజుల చేతిలోనుండి తప్పించుకొని శేషించినవారివైపు ఆయన తిరుగును. 7తమపితరుల దేవుడైన యెహోవాయెడల ద్రోహముగా ప్రవర్తించిన మీపితరులవలెను మీ సహోదరులవలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశమునకు అప్పగించెను. 8మీపితరులవలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతముగా పరిశుద్ధపర చిన ఆయన పరిశుద్ధమందిరములో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీదినుండి తొలగి పోవునట్లు ఆయనను సేవించుడి. 9మీరు యెహోవావైపు తిరిగినయెడల మీ సహోదరులయెడలను మీ పిల్లల యెడలను చెరతీసికొనిపోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణాకటాక్షములుగలవాడు గనుక మీరు ఆయనవైపు తిరిగినయెడల ఆయన మీయందు ప్రసన్ను డగును.
10అంచెవాండ్రు జెబూలూను దేశమువరకును, ఎఫ్రాయిము మనష్షేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరిగాని అచ్చటివారు ఎగతాళిచేసి వారిని అపహ సించిరి. 11అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశములవారిలోనుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. 12యెహోవా ఆజ్ఞనుబట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోనివారికి మనస్సు ఏకముచేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. 13కావున రెండవనెలయందు పులియని రొట్టెలపండుగ ఆచరించుటకై అతివిస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. 14వారు దాని చేపెట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి, కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. 15రెండవనెల పదునాల్గవదినమునవారు పస్కాపశువును వధించిరి; యాజకులును లేవీయులును సిగ్గునొంది, తమ్మును ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను యెహోవా మందిరములోనికి తీసికొని వచ్చిరి. 16దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధినిబట్టి వారు తమ స్థలమందు నిలువబడగా, యాజకులు లేవీయుల చేతిలోనుండి రక్తమును తీసికొని దానిని ప్రోక్షించిరి. 17సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారనేకు లుండుటచేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనని ప్రతివాని నిమిత్తము పస్కాపశువులను వధించుపని లేవీయుల కప్పగింపబడెను. 18ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశములనుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించు కొనకయే విధివిరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా 19పరిశుద్ధస్థలముయొక్క శుద్ధీకరణముచొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా 20యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. 21యెరూషలేములోనున్న ఇశ్రాయేలువారు బహు సంతోష భరితులై పులియనిరొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి. లేవీయులును యాజకులును యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదముగల వాద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచు ఉండిరి. 22యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను; వారు సమాధానబలులు అర్పించుచు, తమపితరుల దేవుడైన యెహోవా దేవుడని యొప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి. 23యూదా రాజైన హిజ్కియా సమాజపువారికి బలియర్పణల నిమిత్తము వెయ్యి కోడెలను ఏడువేల గొఱ్ఱెల నిచ్చుటయు, అధిపతులు వెయ్యి కోడెలను పదివేల గొఱ్ఱెల నిచ్చుటయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయు 24సమాజపు వారందరును చూచి నప్పుడు, మరి ఏడు దినములు పండుగ ఆచరింపవలెనని యోచనచేసికొని మరి ఏడు దినములు సంతోషముగా దాని ఆచరించిరి. 25అప్పుడు యాజకులును లేవీయులును యూదావారిలోనుండియు ఇశ్రాయేలువారిలోనుండియు వచ్చిన సమాజపువారందరును, ఇశ్రాయేలుదేశములోనుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులును సంతోషించిరి. 26యెరూషలేము కాపురస్థులకు మిక్కిలి ఆనం దము కలిగెను. ఇశ్రాయేలురాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగి యుండలేదు. 27అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారిమాటలు వినబడెను; వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 30: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.