హిజ్కియా యేలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యిరువదితొమ్మిది సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్యయంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన యేలుబడియందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి, యాజకులను లేవీయులను పిలువనంపి, తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను–లేవీయులారా, నా మాట ఆలకించుడి; ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, మీపితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధస్థలములోనుండి నిషిద్ధ వస్తువుల నన్నిటిని బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడతలు నడచి ఆయనను విసర్జించి, ఆయన నివాసమునకు పెడ ముఖము పెట్టుకొని దానిని అలక్ష్యముచేసిరి. మరియు వారు మంటపముయొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి, పరిశుద్ధస్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహనబలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదావారిమీదను యెరూషలేము కాపురస్థులమీదను కోపించి, మీరు కన్నులార చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగాచేసెను. కాబట్టి మన తండ్రులు కత్తిచేత పడిరి; మన కుమారులును కుమార్తెలును భార్యలును చెరలోనికి కొనపోబడిరి. ఇప్పుడు మనమీద నున్న ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులైయుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధచేయకుడి. అప్పుడు కహాతీయులలో అమాశై కుమారుడైన మహతు అజర్యా కుమారుడైన యోవేలు, మెరారీయులలో అబ్దీ కుమారుడైన కీషు యెహాల్లెలేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యోవాహు యోవాహు కుమారుడైన ఏదేను ఎలీషాపాను సంతతి వారిలో షిమ్రీ యెహీయేలు, ఆసాపు కుమారులలో జెకర్యా మత్తన్యా హేమాను సంతతివారిలో యెహీయేలు షిమీ, యెదూతూను సంతతివారిలో షెమయా ఉజ్జీయేలు అను లేవీయులు నియమించబడిరి. వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలనుబట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధవస్తువులన్నిటిని యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసికొనిరాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. మొదటి నెల మొదటి దినమునవారు ప్రతిష్ఠచేయ నారంభించి, ఆ నెల యెనిమిదవదినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు ఎనిమిది దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల పదునారవదినమున సమాప్తి చేసిరి. అప్పుడు వారు రాజైన హిజ్కియాయొద్దకు పోయి– మేము యెహోవామందిరమంతటిని దహనబలిపీఠమును ఉపకరణములన్నిటిని సన్నిధి రొట్టెలుంచు బల్లను పవిత్రపరచియున్నాము. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహముచేసి పారవేసిన ఉపకరణములన్నిటిని మేము సిద్ధపరచి ప్రతిష్ఠించియున్నాము, అవి యెహోవా బలిపీఠము ఎదుట ఉన్నవని చెప్పిరి. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడలేచి, పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యముకొరకును పరిశుద్ధస్థలముకొరకును యూదావారికొరకును పాపపరిహారార్థబలి చేయుటకై యేడు కోడెలను ఏడు పొట్టేళ్లను ఏడు గొఱ్ఱెపిల్లలను ఏడు మేకపోతులను వారు తెచ్చియుంచిరి గనుక అతడు –యెహోవా బలిపీఠముమీద వాటిని అర్పించుడని అహరోను సంతతివారగు యాజకులకు ఆజ్ఞాపించెను.
చదువండి 2 దినవృత్తాంతములు 29
వినండి 2 దినవృత్తాంతములు 29
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 2 దినవృత్తాంతములు 29:1-21
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు