2 దినవృత్తాంతములు 20:10-26

2 దినవృత్తాంతములు 20:10-26 TELUBSI

ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయాబీయులతోను శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారియొద్దనుండి తొలగి పోయిరి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మా కిచ్చిన నీ స్వాస్థ్యములోనుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదావారందరును తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతనిమీదికి రాగా అతడీలాగు ప్రకటిం చెను –యూదావారలారా, యెరూషలేము కాపు రస్థులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. రేపు వారిమీదికి పోవుడి; వారు జీజు అను ఎక్కుడుమార్గమున వచ్చెదరు, మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగుకొనదగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదావారలారా, యెరూషలేమువారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలువబడుడి; మీతోకూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతోకూడ ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను; యూదావారును యెరూషలేము కాపురస్థులును యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతివారును కోరహీయుల సంతతివారునగు లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి–యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహోవాను నమ్ము కొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడచుచు–యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయులమీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులును వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవములయొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను; వారు తమకిష్టమైనంతమట్టుకు తీసికొని తాము కొనిపోగలిగినంతకంటె ఎక్కువగా ఒలుచుకొనిరి; కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు మూడుదినములు పట్టెను. నాల్గవదినమునవారు బెరాకా లోయలో కూడిరి; అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటివరకును ఆ చోటికి బెరాకా లోయ యని పేరు.