2 దినవృత్తాంతములు 20:1-23

2 దినవృత్తాంతములు 20:1-23 TELUBSI

ఇది యయిన తరువాత మోయాబీయులును అమ్మోనీయులును మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతుమీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి–సముద్రము ఆవలనుండు సిరియనులతట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది; చిత్తగించుము, వారు హససోన్‌తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, యూదాయంతట ఉపవాసదినము ఆచరింపవలెనని చాటింపగా యూదావారు యెహోవావలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవాయొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలోనుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాలయెదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనులమధ్యను నిలువబడి –మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై యున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసముచేసి, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను, మామీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ యెదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొఱ్ఱపెట్టినయెడల నీవు ఆలకించి మమ్మును రక్షిం చుదువని అనుకొని, యిచ్చట నీ నామఘనతకొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయాబీయులతోను శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారియొద్దనుండి తొలగి పోయిరి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మా కిచ్చిన నీ స్వాస్థ్యములోనుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదావారందరును తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతనిమీదికి రాగా అతడీలాగు ప్రకటిం చెను –యూదావారలారా, యెరూషలేము కాపు రస్థులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. రేపు వారిమీదికి పోవుడి; వారు జీజు అను ఎక్కుడుమార్గమున వచ్చెదరు, మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగుకొనదగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదావారలారా, యెరూషలేమువారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలువబడుడి; మీతోకూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతోకూడ ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను; యూదావారును యెరూషలేము కాపురస్థులును యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతివారును కోరహీయుల సంతతివారునగు లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి–యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహోవాను నమ్ము కొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడచుచు–యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయులమీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి.