2 దినవృత్తాంతములు 2
2
1సొలొమోను యెహోవా నామఘనతకొరకు ఒక మందిరమును తన రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసికొని 2బరువులు మోయుటకు డెబ్బది వేలమందిని, కొండలమీద మ్రానులు కొట్టుటకు ఎనుబదివేల మందిని ఏర్పరచుకొని వీరిమీద మూడువేల ఆరువందలమందిని అధిపతులుగా ఉంచెను. 3సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతలచేత ఈ వర్తమానము పంపెను–నా తండ్రియైన దావీదు నివాసమునకై యొక నగరును కట్టతలచియుండగా నీవు అతనికి సరళ మ్రానులను సిద్ధముచేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. 4నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలములయందును, విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను. 5నేను కట్టించు మందిరము గొప్పదిగానుండును; మా దేవుడు సకలమైన దేవతలకంటె మహనీయుడు గనుక 6ఆకాశములును మహాకాశములును ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపువాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్ట దలచియున్నాను. 7నా తండ్రియైన దావీదు నియమించి యూదాదేశములోను యెరూషలేములోను నాయొద్ద ఉంచిన ప్రజ్ఞగలవారికి సహాయకుడై యుండి, బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను నీలి నూలుతోను చేయుపనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుష్యునొకని నాయొద్దకు పంపుము. 8మరియు లెబానోనునందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలిసేయున్నది. 9కాగా లెబానోనునుండి సరళమ్రానులను దేవదారుమ్రానులను చందనపుమ్రానులను నాకు పంపుము; నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితోకూడ పోవుదురు. 10మ్రానులుకొట్టు మీ పనివారికి నాలుగువందల గరిసెల దంచిన గోధుమలను ఎనిమిదివందల పుట్ల యవలను నూట నలువదిపుట్ల ద్రాక్షారసమును నూట నలువదిపుట్ల నూనెను ఇచ్చెదను.
11అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనునకు వ్రాసిపంపిన ఉత్తరమేమనగా–యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారిమీద రాజుగా నియమించియున్నాడు. 12యెహోవాఘనతకొరకు ఒక మందిరమును నీ రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియుగల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన, భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక. 13తెలివియు వివేచనయుగల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీయొద్దకు పంపు చున్నాను. 14అతడు దాను వంశపురాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధమైనవాడు, అతడు బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను రాళ్లతోను మ్రానులతోను ఊదా నూలుతోను నీలి నూలుతోను సన్నపు నూలుతోను ఎఱ్ఱ నూలుతోను పని చేయగల నేర్పరియైనవాడు. సకలవిధముల చెక్కడపు పనియందును మచ్చులు కల్పించుటయందును యుక్తికలిగి, నీ పనివారికిని నీతండ్రియైన దావీదు అను నా యేలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారియై వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గల వాడు. 15ఇప్పుడు నా యేలినవాడు చెప్పియున్న గోధుమలను యవలను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతి కిచ్చి వారిని సాగనంపినయెడల 16మేము నీకు కావలసిన మ్రానులన్నియు లెబానోనునందు కొట్టించి వాటిని నీకొరకు సముద్రముమీద తెప్పలుగా యొప్పేకు కొనివచ్చెదము, తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొన వచ్చును అని వ్రాసెను.
17సొలొమోను తన తండ్రియైన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్యజాతివారినందరిని, ఎన్నిక వేయించిన యెన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు లక్షయేబదిమూడువేల ఆరువందలమందియైరి. 18వీరిలో బరువులు మోయుటకు డెబ్బది వేలమందిని పర్వతములందు మ్రానులు కొట్టుటకు ఎనుబదివేల మందిని, జనులమీద అధిపతులుగానుండి పనిచేయించుటకు మూడువేల ఆరు వందలమందిని అతడు ఏర్పరచెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 2: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.