1 థెస్సలొనీకయులకు 2:1-16

1 థెస్సలొనీకయులకు 2:1-16 TELUBSI

సహోదరులారా, మీయొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానముపొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియును. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదుగాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడిన వారమై, మనుష్యులను సంతోషపెట్టు వారముకాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారముచేయుటకు సమర్థులమై యున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని, మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీమధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనముచేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును. ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంతదేశస్థులవలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి, అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు, దేవునికి ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట వారిమీదికి వచ్చెను.