1 సమూయేలు 4:1-11

1 సమూయేలు 4:1-11 TELUBSI

ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులమీద తమ్మును యుద్ధపంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే యెక్కువతక్కువ నాలుగు వేలమంది హతులైరి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగిరాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయులముందర ఎందుకు ఓడించెను? షిలోహులో నున్న యెహోవా నిబంధనమందసమును మనము తీసికొని మన మధ్యనుంచుకొందము రండి; అది మన మధ్యనుండినయెడల అది మన శత్రువుల చేతిలోనుండి మనలను రక్షించుననిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడనుండి కెరూబులమధ్య ఆసీనుడైయుండు సైన్యములకధిపతియగు యెహోవా నిబంధనమందసమును తెప్పించిరి. ఏలీయొక్క యిద్దరు కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధనమందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధనమందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరు భూమి ప్రతిధ్వని నిచ్చునంత గొప్పకేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకలధ్వని యేమని అడిగి, యెహోవా నిబంధనమందసము దండులోనికి వచ్చెనని తెలిసికొని జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని–అయ్యో మనకు శ్రమ, ఇంతకుమునుపు వారీలాగు సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలోనుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్లచేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండ బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. ఫిలిష్తీయులు యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ డేరాలకు పరుగెత్తివచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను; ఇశ్రాయేలీయులలో ముప్పదివేల కాల్బలము కూలెను. మరియు దేవుని మందసము పట్టబడెను; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీయొక్క యిద్దరు కుమారులు హతులైరి.