పిమ్మట దావీదు రామాలోని నాయోతునుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి–నేను ఏమి చేసితిని? నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెదకునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమనియడుగగా యోనాతాను–ఆ మాట నీవెన్నటికిని అనుకొనవద్దు, నీవు చావవు; నాకు తెలియజేయకుండ నా తండ్రి చిన్న కార్యమేగాని పెద్దకార్యమేగాని చేయడు; నా తండ్రి ఇదెందుకు నాకు మరుగుచేయుననగా దావీదు–నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలిసికొని, యోనాతానునకు చింత కలుగకుండుటకై యిది అతనికి తెలుపననుకొనుచున్నాడు; అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణముచేయగా యోనాతాను–నీకేమి తోచునో దానినే నేను నీ యెడల జరుపుదుననెను. అందుకు దావీదు–రేపటిదినము అమావాస్య; అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. –దావీదు ఇంటివారికి ఏటేట బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నాయొద్ద సెలవుపుచ్చు కొనెను. అతడు–మంచిదని సెలవిచ్చినయెడల నీ దాసుడనైన నాకు క్షేమమే కలుగును; అతడు బహుగా కోపించినయెడల అతడు నాకు కీడుచేయ తాత్పర్యముగలవాడై యున్నాడని నీవు తెలిసికొని నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను; ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి; నాయందు దోషమేమైన ఉండినయెడల నీ తండ్రియొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతానునొద్ద మనవిచేయగా యోనాతాను–ఆ మాట ఎన్నటికిని అనరాదు; నా తండ్రి నీకు కీడుచేయనుద్దేశము గలిగియున్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును గదా అని అనగా దావీదు–నీ తండ్రి నన్నుగూర్చి నీతో కఠినముగా మాటలాడినయెడల దాని నాకు తెలియజేయువారెవరని యోనాతాను నడిగెను. అందుకు యోనాతాను–పొలములోనికి వెళ్లుదము రమ్మనగా, ఇద్దరును పొలములోనికి పోయిరి. అప్పుడు యోనాతాను–ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి; రేపైనను ఎల్లుండియైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును; అప్పుడు దావీదునకు క్షేమ మవునని నేను తెలిసికొనినయెడల నేను ఆ వర్తమానము నీకు పంపక పోవుదునా? అయితే నా తండ్రి నీకు కీడుచేయనుద్దేశించుచున్నాడని నేను తెలిసికొనినయెడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్లునట్లు నిన్ను పంపివేయనియెడల యెహోవా నాకు గొప్పఅపాయము కలుగజేయుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. అయితే నేను బ్రదికియుండినయెడల నేను చావకుండ యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపక పోయినయెడలనేమి, నేను చనిపోయినయెడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమిమీద నిలువకుండ నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతివారికి దయ చూపక పోయినయెడలనేమి యెహోవా నిన్ను విసర్జించును గాక. ఈలాగున యెహోవా దావీదుయొక్క శత్రువుల చేత దాని విచారించునట్లుగా యోనాతాను దావీదు సంతతివారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమనుబట్టి దావీదుచేత మరల ప్రమాణము చేయించెను.
Read 1 సమూయేలు 20
వినండి 1 సమూయేలు 20
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 సమూయేలు 20:1-17
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు