1 సమూయేలు 13:6-18

1 సమూయేలు 13:6-18 TELUBSI

ఇశ్రాయేలీయులు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలిసికొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నతస్థలములలోను కూపములలోను దాగిరి. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్లి పోయిరిగాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను; జనులందరు భయపడుచు అతని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్దనుండి చెదరిపోవుటయు చూచి – దహనబలులను సమాధానబలులను నా యొద్దకు తీసికొని రమ్మని చెప్పి దహనబలి అర్పించెను. అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసి కొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో–నీవు చేసిన పని యేమని యడిగెను. అందుకు సౌలు–జనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు, నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి –ఇంకను యెహోవాను శాంతిపరచకమునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నామీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితిననెను. అందుకు సమూయేలు ఇట్లనెను–నీ దేవుడైన యెహోవా నీ కిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి; నీ రాజ్యమును ఇశ్రాయేలీయులమీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి యుండెను; అయితే నీ రాజ్యము నిలు వదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల యొకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించినదాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనులమీద అతనిని అధిపతినిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను; సౌలు తనయొద్దనున్న జనులను లెక్కపెట్టగా వారు దాదాపు ఆరు వందలమంది యుండిరి. సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గర నున్న వారితోకూడ బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి; ఫిలిష్తీయులు మిక్మషులో దిగియుండిరి. మరియు ఫిలిష్తీయుల పాళెములోనుండి దోపుడుగాండ్రు మూడుగుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున, ఒఫ్రాకు పోవుమార్గమున సంచరించెను. రెండవ గుంపు బేత్‍హోరోనుకు పోవుమార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములోయ సరిహద్దు మార్గమున సంచరించెను.