1 సమూయేలు 1:7-20

1 సమూయేలు 1:7-20 TELUBSI

ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచు నుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను. ఆమె పెనిమిటియైన ఎల్కానా–హన్నా, నీ వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఏల? నీకు మనో విచారమెందుకు కలిగినది? పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైనవాడను కానా? అని ఆమెతో చెప్పుచు వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనముమీద కూర్చునియుండగా బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చుచు –సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్నశ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసి కొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను, ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులుమాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక యుండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై యున్నదనుకొని –ఎంతవరకు నీవు మత్తురాలవై యుందువు? నీవు ద్రాక్షారసమును నీయొద్దనుండి తీసివేయుమని చెప్పగా హన్నా–అది కాదు, నా యేలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయ లేదుగాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు; అత్యంతమైన కోపకారణమునుబట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పు కొనుచుంటిననెను. అంతట ఏలీ–నీవు క్షేమముగా వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో–నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనముచేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని–నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను.