1 పేతురు 4:1-11

1 పేతురు 4:1-11 TELUBSI

క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును. మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితోకూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు. మృతులు శరీరవిషయములో మానవరీత్య తీర్పు పొందునట్లును ఆత్మవిషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడ సువార్త ప్రకటింపబడెను. అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి. సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అను గ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్.