1 పేతురు 2:4-12

1 పేతురు 2:4-12 TELUBSI

మనుష్యులచేత విసర్జింపబడినను, దేవునిదృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై, యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా –ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో సాప్థిచుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది. విశ్వ సించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వ సింపనివారికైతే –ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను. కట్టువారు వాక్యమునకవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ లను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారిమధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.