1 పేతురు 2:11-25

1 పేతురు 2:11-25 TELUBSI

ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ లను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారిమధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువునిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతి దండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి. ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రముకాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును. తప్పిద మునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొఱ్ఱెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.