ఇశ్రాయేలీయుల సమాజకులందరు చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలువబడి ఆకాశముతట్టు చేతులెత్తి యిట్లనెను –యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమియందైనను నీవంటి దేవుడొకడును లేడు; పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కని కరము చూపుచు ఉండువాడవై యున్నావు, నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి, నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చియున్నావు. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా–నీ కుమారులు సత్ ప్రవర్తనగలవారై, నీవు నా యెదుట నడచినట్లు నా యెదుట నడచినయెడల, నా దృష్టికి అనుకూ లుడై ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడగువాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిర పరచుము. ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి, యీ దినమున నీ దాసుడనైన నేనుచేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము. నీ దాసుడనైన నేనుచేయు ప్రార్థనను దయతో అంగీ కరించునట్లు–నా నామము అక్కడ ఉండునని యే స్థలమునుగూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన యీ మందిరముతట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్ల, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయముచేయగా అతనిచేత ప్రమాణము చేయించుటకు అతనిమీద ఒట్టు పెట్టబడినయెడల, అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టు నప్పుడు నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయము తీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతిచొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. మరియు ఇశ్రాయేలీయులగు నీ జనులు నీకు విరోధముగా పాపముచేయుటచేత తమ శత్రువులయెదుట మొత్తబడినప్పుడు, వారు నీతట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని యీ మందిరమందు నిన్నుగూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్ల నీవు ఆకాశమందు విని, ఇశ్రాయేలీయులగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేక పోగా, నీవు వారిని ఈలాగునశ్రమపెట్టుటవలనవారు నీ నామమును ఒప్పు కొని తమ పాపములను విడిచి యీ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసినయెడల నీవు ఆకాశమందు విని, నీ దాసులైన ఇశ్రాయేలీయులగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన సన్మార్గమును వారికి చూపించి, నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. దేశమందు క్షామముగాని తెగులుగాని గాడ్పుదెబ్బగాని చిత్తపట్టుటగాని మిడ తలుగాని చీడపురుగుగాని కలిగినను, వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులుగాని వ్యాధిగాని కలిగినను, ఇశ్రాయేలీయులగు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలిసికొనును గదా; ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరముతట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసినయెడల ప్రతి మనిషియొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమను నీ నివాసస్థలమందు విని, క్షమించి దయచేసి యెవరి ప్రవర్తననుబట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రదుకు దినములన్నిటను వారు నీయందు భయభక్తులు కలిగియుండునట్లు చేయుము; నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలిసికొని యున్నావు. మరియు ఇశ్రాయేలీయులగు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమునుబట్టి దూరదేశమునుండి వచ్చి నీ ఘనమైన నామమునుగూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, నీవు చాపిన బాహువు ప్రసి ద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి యీ మందిరముతట్టు తిరిగి ప్రార్థన చేసినయెడల ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తము ననుగ్రహించుము, అప్పుడు లోకములోని జనులందరును నీ నామమును ఎరిగి, ఇశ్రాయేలీయులగు నీ జనులవలెనే నీయందు భయభక్తులు కలిగి, నేను కట్టించిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడిన దని తెలిసికొందురు. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనను బయలుదేరునప్పుడు, నీవు కోరుకొనిన పట్టణముతట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరముతట్టును యెహోవావగు నీకు వారు ప్రార్థన చేసినయెడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని, వారికార్యమును నిర్వహించుము. పాపము చేయనివాడు ఒకడును లేడు, వారు నీకు విరోధముగా పాపము చేసినయెడల నేమి, నీవు వారిమీద కోపగించుకొని వారిని శత్రువులచేతికి అప్పగించినయెడలనేమి, వారు వీరిని దూరమైనట్టిగాని దగ్గరయైనట్టిగాని ఆ శత్రువుల దేశములోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని–మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితిమని చెప్పి, తమ్మును చెరగా కొనిపోయిన వారిదేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసినయెడల తమ్మును చెరగా కొనిపోయిన వారియొక్క దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను వారు నీతట్టు తిరిగి, నీవు వారి పితరులకు దయచేసిన దేశముతట్టును నీవు కోరుకొనిన పట్టణముతట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరముతట్టును నిన్నుగూర్చి ప్రార్థనచేసినయెడల ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారికార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పులచేత నీ విషయమై అపరాధు లైరో ఆ తప్పులను వారికి క్షమించి, వారిని చెరలోనికి కొనిపోయినవారు వారిని కనికరించునట్లు వారియెడల కని కరము పుట్టించుము. వారు ఐగుప్తుదేశములోనుండి ఆ ఇనుపకొలిమిలోనుండి నీవు రప్పించిన నీ జనులును నీ స్వాస్థ్యమునై యున్నారు. కాబట్టి నీ దాసుడనైన నేనుచేయు విన్నపముమీదను, ఇశ్రాయేలీయులగు నీ జనులుచేయు విన్నపముమీదను, దృష్టియుంచి, వారు ఏ విషయములయందు నిన్ను వేడుకొందురో ఆ విషయములయందు వారి విన్నపముల నాలకించుము. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులోనుండి రప్పించి నప్పుడు నీవు నీ దాసుడైన మోషేద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులంద రిలోనుండి వారిని ప్రత్యేకించితివి గదా.