1 రాజులు 3:16-28

1 రాజులు 3:16-28 TELUBSI

తరువాత వేశ్యలైన యిద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతె యిట్లు మనవి చేసెను–నా యేలినవాడా చిత్తగించుము, –నేనును ఈ స్త్రీయును ఒక యింటిలో నివసించుచున్నాము; దానితోకూడ ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన మూడవదినమున ఇదియు పిల్లను కనెను; మేమిద్దరమును కూడనున్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి యెవరును లేరు. అయితే రాత్రియందు ఇది పడకలో తన పిల్లమీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్య రాత్రి యిది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి, నా ప్రక్కలోనుండి నా బిడ్డను తీసికొని తన కౌగిటిలో పెట్టుకొని, చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చినదాయెను; తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలిసికొంటిని. అంతలో రెండవ స్త్రీ–అది కాదు; బ్రదికియున్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె–కాదు, చచ్చినదే నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజుసముఖమున మనవిచేయగా రాజు–బ్రదికియున్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని యొకతెయు, రెండవది–ఆలాగు కాదు చచ్చినది నీ బిడ్డ బ్రదికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది; గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా రాజు రెండు భాగములుగా బ్రదికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. అంతట బ్రదికియున్న బిడ్డయొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొనిపోయినదై, రాజునొద్ద–నా యేలినవాడా, బిడ్డను ఎంతమాత్రము చంపక దానికే యిప్పించుమని మనవిచేయగా, ఆ రెండవ స్త్రీ–అది నాదైనను దానిదైనను కాకుండ చెరిసగము చేయుమనెను. అందుకు రాజు–బ్రదికియున్న బిడ్డను ఎంతమాత్రము చంపక మొదటిదాని కియ్యుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతట ఇశ్రాయేలీయులందరును రాజు తీర్చిన తీర్పునుగూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి.

Free Reading Plans and Devotionals related to 1 రాజులు 3:16-28