1 రాజులు 19:15-21

1 రాజులు 19:15-21 TELUBSI

అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చిన దేమనగా–నీవు మరలి అరణ్యమార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశముమీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము; ఇశ్రాయేలు వారిమీద నింషీకుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయైయుండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హజాయేలుయొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని యెహూ హతముచేయును; యెహూయొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని ఎలీషా హతము చేయును. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు. ఏలీయా అచ్చటనుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను. ఏలీయా అతని చేరబోయి తన దుప్పటి అతనిమీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలీయావెంట పరుగెత్తి–నేను పోయి నా తలి దండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబ డించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు–పోయి రమ్ము, నావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకతడు అతనిని విడిచి వెళ్లి కాడియెడ్లను తీసి, వధించి వాటిమాంసమును గొర్తినొగల చేత వంటచేసి జనులకు వడ్డించెను. వారు భోజనముచేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను.