1 రాజులు 18:16-40

1 రాజులు 18:16-40 TELUBSI

అంతట ఓబద్యా అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలీయాను కలిసికొనుటకై అహాబు బయలుదేరెను. అహాబు ఏలీయాను చూచి–ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా అతడు–నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవును, నీ తండ్రి యింటివారును ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువారై యున్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారినందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి ప్రవక్త లైన నాలుగువందలమందిని నాయొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను. అహాబు ఇశ్రాయేలువారందరియొద్దకు దూతలను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను. ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి –యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపులమధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిననుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి. అప్పుడు ఏలీయా– యెహోవాకు ప్రవక్తలైనవారిలో నేను ఒకడనే శేషించియున్నాను; అయితే బయలునకు ప్రవక్తలు నాలుగువందల ఏబదిమంది యున్నారు. మాకు రెండు ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచవలెను, రెండవ యెద్దును నేను సిద్ధము చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; నేనైతే యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలీయా మరల జనులతో చెప్పగా జనులందరును–ఆ మాట మంచిదని ప్రత్యుత్తర మిచ్చిరి. అప్పుడు ఏలీయా బయలు ప్రవక్తలను పిలిచి–మీరు అనేకులైయున్నారు గనుక మీరే మొదట ఒక యెద్దును కోరుకొని సిద్ధముచేసి మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; అయితే మీరు అగ్నియేమియు క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన యెద్దును తీసికొని సిద్ధముచేసి, ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు–బయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరునుబట్టి ప్రార్థనచేసిరిగాని యొక మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేకపోగా, వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులువేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నముకాగా ఏలీయా–వాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానముచేయుచున్నాడేమో, దూరముననున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసియున్నదేమో అని అపహాస్యముచేయగా వారు మరి గట్టిగా కేకలువేయుచు, రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను కోసికొనుచు నుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయమువరకు వారు ప్రకటనముచేయుచు వచ్చిరి గాని, మాటయైనను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యముచేసినవాడైనను లేక పోయెను. అప్పుడు ఏలీయా–నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరును అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడ ద్రోయబడియున్న యెహోవా బలిపీఠమును బాగుచేసి, యెహోవావాక్కు ప్రత్యక్షమై – నీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి యెద్దును తునకలుగా కోసి ఆ కట్టెలమీద ఉంచి, జనులు చూచుచుండగా–మీరు నాలుగు తొట్లనిండ నీళ్లు నింపి దహనబలి పశుమాంసముమీదను కట్టెలమీదను పోయుడని చెప్పెను అదియైన తరువాత–రెండవ మారు ఆప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును ఆలాగు చేసిరి; –మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి; అప్పుడు ఆ నీళ్లు బలిపీఠముచుట్టును పొర్లి పారెను; మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెను – యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయులమధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవుచేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీతట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతట జనులందరును దాని చూచి సాగిలపడి–యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి. అప్పుడు ఏలీయా–ఒకనినైన తప్పించుకొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలీయా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను.