1 యోహాను 4:11-19

1 యోహాను 4:11-19 TELUBSI

ప్రియులారా, దేవుడు మన లను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించినయెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మనయందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు తన ఆత్మ లో పాలు దయచేసియున్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పు కొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు. మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు. తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము. ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండ నతోకూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.