1 కొరింథీయులకు 9:19-27

1 కొరింథీయులకు 9:19-27 TELUBSI

నేను అందరి విషయము స్వతంత్రుడనై యున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగానియొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురిచూడనివానివలె పరుగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.