1 కొరింథీయులకు 9:14-23

1 కొరింథీయులకు 9:14-23 TELUBSI

ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు నాయెడల యీలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించు చున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ. ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహనిర్వాహ కత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగ పరచుకొనకుండ సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై యున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.