1 కొరింథీయులకు 7:12-24

1 కొరింథీయులకు 7:12-24 TELUBSI

ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పున దేమనగా–ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడినయెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్య జింపకూడదు. అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధపరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులైయుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహో దరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? అయితే ప్రభువు ప్రతివానికి ఏస్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏస్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే యుండవలెను. దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడల, స్వతంత్రుడవగుట మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్యము పొందినవాడు. ఆ ప్రకా రమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతిమనుష్యుడును ఏస్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను.