1 కొరింథీయులకు 15:35-49

1 కొరింథీయులకు 15:35-49 TELUBSI

అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును. ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజ యైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశవస్తు రూపములు కలవు, భూవస్తురూపములు కలవు; ఆకాశ వస్తురూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు. నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదముకలదు గదా మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును; ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలీహనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును; ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీర మున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది. ఇందు విషయమై–ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను. ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది. మొదటి మను ష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు. మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టి వారే. మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోకసంబంధి పోలికయు ధరింతుము.